Site icon Prime9

Rahul Gandhi Files Nomination: రాయ్‌ బరేలీలో నామినేషన్‌ వేసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi(RBL)

Rahul Gandhi(RBL)

Rahul Gandhi Files Nomination: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు నేటితో తెరపడింది. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ లోకసభ సీటుకు నామినేషన్‌ ఫైల్‌ చేశారు. కాగా నామినేషన్‌ ఫైల్‌ చేయడానికి ఆయన వెంట మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు వచ్చారు. ఇక రాయబరేలీ నియోజకవర్గం గాంధీ, నెహ్రూ కుటుంబసభ్యులు లేదా వారి మిత్రులు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించారు. కాగా అమెధీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు కిశోరీ లాల్‌ శర్మను బరిలో నిలిపింది. కాగా రాయబరేలీ నియోజకవర్గం విషయానికి వస్తే గత రెండు దశాబ్దాల నుంచి సోనియాగాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక రాయ్‌బరేలీ సీటుకు రాహుల్‌ నానమ్మ ఇందిరాగాంధీ, ఆయన తాత ఫిరోజ్‌ గాంధీ కూడా ఈ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు.

కాంగ్రెస్‌పార్టీకి కంచుకోట (Rahul Gandhi Files Nomination)

ఇదిలా ఉండగా రాయబరేలీ నియోజకవర్గం 1951 నుంచి కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉంది. కాగా సోనియగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ముందు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ భర్త, కాంగ్రెస్‌ నాయకుడు ఫిరోజ్‌గాంధీ రెండు సార్లుప్రాతినిధ్యం వహించారు. ఒకటి 1952లో, అటు తర్వాత 1957లో ఈ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఇన్ని సంవత్సరాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే నెహ్రూ గాంధీ కుటుంబం ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. అదీ 1962, అటుతర్వాత 1999లో పోటీ చేయలేకపోయింది.

ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 80 లోకసభ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. 17లోకసభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తోంది. ఇక రాహుల్‌ విషయానికి వస్తే ఆయన అమేధీ లోకసభ నుంచి 2004 నుంచి 2019 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన స్మృతి ఇరానీ చేతిలో 55వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఇక రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ కూడా 1981 నుంచి ఆయన మృతి చెందే వరకు అంటే 1991 వరకు అమెధీ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాహుల్‌వయనాడ్‌ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి 2024 లోకసభ ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ బావ రాబర్ట్‌ వాద్రాతో కలిసి ప్రత్యేక విమానంలో అమెధీలోని పుర్‌సత్‌ గంజ్‌ విమానాశ్రయంలో దిగారు. వారి వెంట రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ కూడా వచ్చారు. రాహుల్‌ రాయబరేలీలో నామినేషన్‌ వేయడానికి రావడంతో నగరం మొత్తం పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. మే 20న ఐదవ విడత రాయబరేలీ లోకసభ నియోజకవర్గానికి పోలింగ్‌ జరుగనుంది.

Exit mobile version