Site icon Prime9

Prof. Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా జైలులోనే … బాంబే హైకోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

Prof. Saibaba

Prof. Saibaba

Prof. Saibaba: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ను విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు ఉత్తర్వలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేకంగా విచారణ జరిపింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సాయిబాబా ను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు లో వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదన్నారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు కోర్టు తిరస్కరించిందని చెప్పారు.

తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.
ప్రొఫెసర్ సాయిబాబా తరపున సీనియర్ అడ్వకేట్ బసంత్ వాదనలు వినిపించారు. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను ఏడేళ్ళ నుంచి జైలులో ఉంచారని తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జైలు బయట, ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్ సాయిబాబా 2014 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆయన 2017లో హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఆయన నాగపూర్ జైలులో ఉన్నారు. బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో ప్రొఫెసర్ సాయిబాబా సహా ఐదుగురిని ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ, తీర్పు చెప్పింది.

Exit mobile version