Modi swearing-in ceremony: లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్‌డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మోదీనే..( Modi swearing-in ceremony)
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడో సారి పగ్గాలు చేపడితే.. మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడవ సారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రికార్డు మోదీ సృష్టించినట్లు అవుతుంది.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించి లోకసభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా మోదీ కేబినెట్ ప్రస్తుత లోకసభను రద్దు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లోకసభకు కాల పరిమితి ఈ నెల 16న ముగియనుంది.
ఇదిలా ఉండగా సీనియర్ ఎన్‌డీఏ నాయకులు ఒక్కొక్కరు ఢిల్లీకి రావడం మొదలైంది. ఎన్‌డీఏ నాయకులు కూడా ప్రభుత్వం ఏర్పాటు గురించి మోదీతో చర్చిస్తున్నారు. జెడీయు నాయకులు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే ప్రధానితో భేటీ కానున్నారు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం బీజేపీ మిత్రపక్షాలు ఇప్పటికే మోదీ కేబినెట్‌లో తమకు ఇన్ని బెర్త్‌లు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ పెట్టాయి. కాగా జెడీయు మూడు కేబినెట్ స్థానాలు డిమాండ్ చేసింది. మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయానికి వస్తే ఒక కేబినెట్ పదవి.. రెండు సహాయమంత్రుల పదవి కావాలని డిమాండ్ చేశారు.