Site icon Prime9

PM Modi comments: విదేశాల్లో వివాహవేడుకలపై ప్రశ్నించిన ప్రధాని మోదీ

PM Modi

PM Modi

PM Modi comments: దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ”మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్‌లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అంత అవసరం ఉందా?..(PM Modi comments)

దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో 5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్ల కోసం షాపింగ్‌కు వెళ్లినప్పుడు దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి” అని మోదీ కోరారు. ”వివాహాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక అంశం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. నా మనసులోని ఆవేదన నా కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి చెబుతాను?. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు పెద్ద కుటుంబాల వారు విదేశాలు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. అంత అవసరం ఉందా? అని మోదీ ప్రశ్నించారు. అదే ఇండియాలోనే వివాహ సంబరాలు చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్టు ఉంటుందని, దేశంలోని సొమ్ము దేశంలోనే ఉంటుందన్నారు. ఇక్కడి ప్రజలకే సేవల రూపంలో కానీ, మరో రూపంలో కానీ అవకాశాలు ఇచ్చినట్టు కూడా ఉంటుందని తెలిపారు. పేద ప్రజలు కూడా మీ వివాహాల గురించి తమ పిల్లలకు గొప్పగా చెబుతారని, వోకల్ ఫర్ లోకల్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లినట్టు అవుతుందని మోదీ అన్నారు. తన ఆవేదన తప్పనిసరిగా ఉన్నత కుటుంబాల వారు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ.

వోకల్ ఫర్ లోకల్ కీలకం..

గత నెల ఫెస్టివ్ సీజన్‌లో ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రాధాన్యత గురించి తాను చెప్పడం జరిగిందని, ఆ తర్వాత కొద్దిరోజులకే దీపావళి, రాఖీ, ఛాత్ పండుగల్లో 4 లక్షల కోట్లు విలువ చేసే స్వదేశీ ఉత్పత్తుల వ్యాపారం జరిగిందని ప్రధాని వివరించారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి కనబరిచారని తెలిపారు. ఇవాళ మన పిల్లలు సైతం షాపులో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు ఇండియాలో తయారైందా లేదా అని దానిపై చూసి కొనుగోలు చేయడం మొదలైందన్నారు. అభివృద్ధి భారత-అభ్యుదయ భారతానికి ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది చాలా కీలకమని చెప్పారు ప్రధాని. ఇది బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఉపాధికి గ్యారెంటీ ఉంటుందని, ఇది దేశాభివృద్ధికి దారితీస్తుందన్నారు ప్రధాని మోదీ.

Exit mobile version