Prime Minister Modi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 19) తన ఆరు రోజుల పర్యటన కోసం మూడు దేశాలైన జపాన్, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాకు బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి బయలుదేరారు. తన పర్యటనలో, ప్రధాని మోడీ గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరుకానున్నారు.
G-7 సదస్సుకు ప్రధాని మోదీ ..(Prime Minister Modi Tour)
G-7 సదస్సు కోసం జపాన్ ప్రధాన మంత్రి కిషిడా ఫుమియో ఆహ్వానం మేరకు 2023 మే 19 నుండి 21 వరకు జపాన్‌లోని హిరోషిమాను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. సదస్సులో ఆహారం, ఎరువులు మరియు ఇంధన భద్రతతో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన మాట్లాడతారని భావిస్తున్నారు. అంతేకాకుండా, శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పీఎం కిషిదాతో పాటు ఇతర దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించనున్నారు.
జపాన్ నుండి ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాలోని పోర్ట్ మోర్స్బీకి వెళతారు, అక్కడ మే 22 న పాపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపేతో సంయుక్తంగా ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC III సమ్మిట్) యొక్క 3వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడేతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2014లో ప్రారంభించబడిన, FIPICలో భారతదేశం మరియు 14 పసిఫిక్ ద్వీప దేశాలు ఉన్నాయి . ఇక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆస్ట్రేలియాకు మోదీ..
ఆరు రోజుల పర్యటనలో చివరి దశలో, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బిడెన్‌తో పాటు క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2023 మే 22 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. 23న సిడ్నీలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మే 24న పీఎం అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి, ఆస్ట్రేలియన్ సీఈఓలు మరియు వ్యాపార ప్రముఖులతో సంభాషించనున్నారు.