Pranab Mukherjee Comments: గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ కి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారని తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో శర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు.
బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. రాహుల్ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను కూడా శర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు.రాహుల్ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. అనేక ప్రశ్నలు సంధిస్తారు. కానీ, రాజకీయాల్లో ఆయన పరిణతి సాధించలేదు. 2013 జులైలో రాహుల్ ఓ సారి మా ఇంటికి వచ్చారు. పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన ప్రణాళికలను చెప్పారు. ఆయన సవాళ్లను ఎదుర్కోగలరని అనిపించింది. అయితే, ముందు కేబినెట్‌లో చేరి పాలనాపరమైన అంశాల్లో అనుభవం గడించాలని చెప్పా. కానీ నా సలహాను ఆయన వినిపించుకోలేదు అని ప్రణబ్ నాటి సంగతులను తన డైరీలో రాసుకున్నారు.
2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ప్రతులను రాహుల్ మీడియా ముందు చించేసిన ఘటనను కూడా శర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఆ విషయం తెలియగానే ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. రాహుల్ అసలు ఏమనుకుంటున్నారు? ఆయన కేబినెట్ సభ్యుడు కాదు. కేబినెట్ నిర్ణయాన్ని బహిరంగంగా చించేయడానికి ఆయనెవరు? ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశాల్లో ఉన్నారు. తన చర్యలు ప్రధానిపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆయనకు తెలుసా? అని ఆరోజు ప్రణబ్ ఆగ్రహించినట్లు శర్మిష్ఠ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ప్రణబ్ తన డైరీలో‘గాంధీ-నెహ్రూ కుటుంబాల అహంకారమంతా రాహుల్‌కు వచ్చింది. కానీ వారి రాజకీయ చతురతే ఆయనకు అబ్బలేదు అని రాసుకున్నారట ప్రణబ్. రాహుల్ అలా ఆర్డినెన్స్ పత్రాలను చించేయడంతోనే యూపీఏ కూటమి మరింత పతనమైందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో యూపీఏ ఓటమికి ఇది కూడా ఓ కారణమే. ప్రధానినే గౌరవించని వారికి ఎవరైనా ఎందుకు ఓటేస్తారు ? అని అప్పట్లో ఆయన పార్టీకి తెలిపినట్లు శర్మిష్ఠ తన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ అంశాలను ఆమె ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు.