PM Modi Visits Vizag on International Yoga Day: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని చేరుకోనున్నారు. తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు ఆర్కే బీచ్ రోడ్ లో జరిగే యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11.50కి విశాఖ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పొరబాట్లు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు రేపు విశాఖకు వెళ్లనున్నారు. ఆర్కే బీచ్ వద్ద జరిగే యోగా డే ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ మేరకు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. యోగా డే ఏర్పాట్లపై సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.