Site icon Prime9

Manipur women: మణిపూర్ మహిళల ఘటనపై సుప్రీం సీరియస్.. నిందితులను వదిలేదిలేదు, కఠినంగా శిక్షిస్తామన్న మోదీ

manipur women

manipur women

Manipur women: గత కొంతకాలంగా మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రెండు తెగల అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం తాజాగా విడుదలైన వీడియో ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వర్గం వారు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి గ్రామ వీధుల్లో ఊరేగించిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా నడిపిస్తూ వారిని కొడుతూ, దూషిస్తూ ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తమను వదిలేయాలని ఆ అసహాయ మహిళలు ఏడుస్తూ, వేడుకుంటున్నా ఆ దుర్మార్గులు కనికరించలేదు గ్రామ వీధుల్లో కర్కషంగా వారిని వేధించారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారడంతో మణిపూర్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వీడియోను యావత్ భారతం ఖండించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అక్కడి మహిళలు తీవ్ర వ్యధను అనుభవిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వీడియోలు షేర్ చేస్తే శిక్ష తప్పదు (Manipur women)

ఇక ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌తో సహా ఇతర అన్ని సోషల్‌ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇది చాలా సునిశితమైన అంశం అని ఇది భారతీయుల గౌరవానికి సంబంధించిన విషయమని శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా తక్షణమే వీడియోలను తొలగించాలని అన్ని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. అలాగే ఈ వీడియోలను షేర్ చేసిన డౌన్లోడ్ చేసి ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సుప్రీం సీరియస్

అలాగే కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం స్పందించింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్‌ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెంటనే తెలపాలని ఆదేశించింది. ఈ ఘటనపై తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే చర్యలకు ఉపక్రమిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

నిందితులను వదలబోము

మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, ఈ మానవహింసపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆయన కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటన తన హృదయాన్ని ఎంతో ధ్రవింపచేసిందని ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని ఆయన వ్యాఖానించారు. శాంతిభద్రతలకు  సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. మణిపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ.. మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమని, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.

 

Exit mobile version
Skip to toolbar