PM Modi Satires: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ ‘షోలే’ సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ షోలే డైలాగులను కూడా మించి కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఉన్నాయని ప్రధాని అన్నారు. మౌసితో వివాహ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నప్పుడు జై (అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర) ధర్మేంద్ర పోషించిన అతని స్నేహితుడు పాత్ర (వీరూ) ను సమర్థించే సన్నివేశాన్ని ప్రధాని ప్రస్తావించారు. మూడోసారి ఓడిపోయారు. కానీ ఇది మాకు నైతిక విజయం అని అంటున్నారని కాంగ్రెస్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.ఓడిపోయినా పార్టీ గెలిచిందని కాంగ్రెస్ మద్దతుదారులు నమ్మబలికిన పరిస్థితి సరిగ్గా అలాగే ఉందన్నారు. బూటకపు విజయోత్సవ సంబరాల్లో ప్రజల తీర్పును అణచివేయవద్దని కాంగ్రెస్ నాయకులను కోరారు. 13 రాష్ట్రాల్లో సున్నా సీట్లు వచ్చాయి కాని అతను హీరోనా అంటూ రాహుల్ గాంధీ నుద్దేశించి ప్రధాని మోదీ కామెంట్ చేసారు. 99 మార్కులు సాధించిన అబ్బాయి ఉన్నాడని, అతను దానిని అందరికీ చూపించాడని మోదీ అన్నారు. 99 వినగానే ప్రజలు చాలా ప్రోత్సహించేవారని అయితే ఒక టీచర్ వచ్చి అసలు విషయం చెప్పాడని అన్నారు. నువ్వు మిఠాయిలు ఎందుకు పంచుతున్నావు? 100 కు 99 రాలేదు. 543కు 99 వచ్చాయని చెప్పారని అన్నారు. తన ఫెయిల్యూర్ తో ప్రపంచ రికార్డు సృష్టించారంటూ రాహుల్ పై మోదీ సెటైర్లు వేసారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది, 2019 కంటే 47 పెరిగింది. అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మూడవ అతిపెద్ద ఓటమి అని ప్రధాని మోదీ అన్నారు. సానుభూతి పొందేందుకు కొత్త డ్రామా ప్రారంభించారని, అయితే వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై ఉన్నారనే నిజం దేశానికి తెలుసని అన్నారు. ఓబీసీ ప్రజలను దొంగలు అన్న కేసులో దోషిగా తేలిన ఆయన.. సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ లాంటి మహనీయుడిని అవమానించినందుకు ఆయనపై కేసు ఉందని మోదీ పేర్కొన్నారు.