PM Modi in Mumbai: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జిని ముంబైలో ప్రారంభించారు. కాగా ఈ బ్రిడ్జికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పెట్టారు. 21.8 కిలోమీటర్ల ఆరులేన్‌ల బ్రిడ్జికి 18వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఒక లక్షా 77వేల 903 మెట్రలిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ ఉక్కు బరువును లెక్కిస్తే సుమారు 500 బోయింగ్ విమానాలంత బరువు.. లేదా పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి ఉపయోగించిన బరువుతో పోల్చుకుంటే 17 రెట్లు అధికంగా ఉంటుంది.
రోజుకు 70 వేలకు పైగా వాహనాలు..(PM Modi in Mumbai)
అటల్ సేతు లింక్ ద్వారా ముంబైలోని సెవారి నుంచి రాయగడ్ జిల్లాలోని ఉరాన్ తాలూకాలోని నవ శేవ వరకు కలుపుతుంది. కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఇదే ముంబై నుంచి నవీ ముంబైకి వెళ్లాలంటే రెండు గంటల సమయం పట్టేది.కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో నవీ ముంబై నుంచి ఇతర ప్రాంతాలతో ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. దీంతో పాటు ట్రాఫిక్ జామ్‌ల ఇబ్బందులు తప్పుతాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి పై ప్రతి రోజు 70వేల కంటే ఎక్కువ వాహనాలు రాకపోకలు సాగించగలవని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.