PM Modi in Solapur: ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తర్వాత షోలాపూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
శ్రీరాముడి ప్రేరణతో..(PM Modi in Solapur)
ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. నేను వెళ్లి ఈ ప్రాజెక్టు చూసాను. ఈ ఇళ్లను చూడగానే నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో నేను కూడా ఇలాంటి ఇంట్లో నివిసించే అవకాశం వస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించానంటూ కన్నీళ్లు పెట్టారు. తమ ప్రభుత్వం నిజాయతీతో కూడిన పాలనకు సంబంధించిన శ్రీరాముడి సూత్రాల నుండి ప్రేరణ పొందిందని పేర్కొన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిగే జనవరి 22న రామజ్యోతి వెలిగించాలని ప్రజలను కోరారు.మోదీ హామీ అంటే పూర్తి అవడానికి గ్యారంటీ అని అర్థం. కట్టుబాట్లను గౌరవించాలని రాముడు మాకు నేర్పించాడు. పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం మేము నిర్దేశించిన అన్ని లక్ష్యాలను నెరవేరుస్తున్నామని మోదీ అన్నారు.షోలాపూర్ ప్రాజెక్ట్ లబ్దిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్ లూమ్ కార్మికులు,బీడీ కార్మికులు, డ్రైవర్లు ఉన్నారు.