Site icon Prime9

PM Modi: కేంద్రమంత్రులను అయోధ్యకు వెళ్లవద్దన్న ప్రధాని మోదీ.. ఎందుకో తెలుసా?

Ayodhya

Ayodhya

PM Modi: అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు. వీరి ఆరాటాన్ని గమనించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని సూచించారు.. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

భక్తులకు అసౌకర్యం కలగకుండా ..(PM Modi)

వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్‌ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు.

సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆలయ ట్రస్టు కూడా ఉత్తరప్రదేశ్‌ పొరుగున ఉన్న జిల్లాల వారిని రాముడిని దర్శించుకోవడానికి వెంటనే రావద్దని దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారని వారికి నచ్చజెప్పుతున్నారు. తాజా ప్రధాని కూడా తన మంత్రివర్గ సహచరులను అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు.

Exit mobile version
Skip to toolbar