Arvinder Singh Lovely: కాంగ్రెస్ పార్టీకి మాజీ డిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ ఝలక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పిన అర్విందర్‌సింగ్ లవ్లీ శనివారం నాడు బీజేపీ కండువ కప్పుకున్నాడు. ఇక అర్విందర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీతో పొత్తు పెట్టుకోవడమే. ఆప్‌తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంతకు ముందు ఆయన తాను పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీకి కాదన్నారు.
డిల్లీని రక్షించుకునేందుకు..(Arvinder Singh Lovely)
గత వారం ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానికి పంపించారు. ఈ లేఖలో ఆయన నార్త్ ఈస్ట్ దిల్లీ నుంచి కన్హాయకుమార్‌ను, నార్త్ వెస్ట్ నుంచి ఉదిత్‌రాజ్‌ను బరిలో నిలపడం పట్ల అభ్యతరం వ్యక్తం చేశారు. డిల్లీ కాంగ్రెస్‌కు వీరిద్దరు కొత్తవారని లవ్లీ సింగ్ అన్నాడు. అయితే వీరికి టిక్కెట్ ఇచ్చినందుకు నిరసనగా తాను రాజీనామా చేయడం లేదని వివరణ ఇచ్చాడు. వారం తిరిగే సరికి ఆయన మాట మార్చి ఆయన శనివారం నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిపోయాడు. దేశానికి, దిల్లీకి సేవచేయడానికి అవకాశం చిక్కిందన్నారు. ఈ రోజు బీజేపీలో ఐదుగురు నాయకులం చేరామన్నారు. దిల్లీని రక్షించుకునేందుకు తమకు అవకాశం చిక్కిందన్నారు. దిల్లీ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్ నుంచి రాజీనామాకు దారితీసిన పరిస్థితులు అందరికి తెలుసన్నారు. తన మద్దతుదారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు తనను ఇంట్లో కూర్చోవద్దు, బలమైన పార్టీలో చేరి దిల్లీ ప్రజలకు సేవలందించాలని కోరారని అర్విందర్ సింగ్ లవ్లీ వివరించారు. అర్విందర్‌సింగ్ లవ్లీ రాజీనామా దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే డిల్లీ కాంగ్రెస్ యూనిట్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్‌తో పొత్తు వద్దని వారించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతిపార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆప్ పార్టీతో పొత్తును దిల్లీ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారని లవ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాసిన లేఖలో ప్రస్తావించారు. దిల్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకుంది. అయినా పార్టీ నిర్ణయాన్ని తాము గౌరవించామన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన ఇంటికి తాను సుభాష్ చోప్రా, సందీప్ దీక్షిత్‌తో కలిసి వెళ్లామన్నారు. పొత్తుకు తాను వ్యతిరేకించినా.. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి వెళ్లానని లవ్లీ వివరించారు.