Operation Ajay: ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఢిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడుల తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఈ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.
స్వదేశానికి 918 మంది భారతీయులు..(Operation Ajay)
ఇజ్రాయెల్ నుంచి తమను తరలించినందుకు ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ భయపడ్డామని.. సర్కారు చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమానంలోని 197 మంది భారతీయులు భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలు చేసిన వీడియోను ట్వీట్ చేశారు.ఇజ్రాయెల్ నుంచి మొదటి చార్టర్ విమానం గురువారం 212 మందిని తీసుకువచ్చింది. రెండో బ్యాచ్‌లో 235 మంది భారతీయులు తిరిగి వచ్చారు. ఇప్పటివరకు మొత్తం 918 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి వచ్చారు. ఇప్పటికీ ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకునేవారు అత్యవసరంగా జతచేసిన ప్రయాణ ఫారమ్‌ను పూర్తి చేయాలని రాయబార కార్యాలయం సూచించింది. భారత రాయబార కార్యాలయం ఆపరేషన్ అజయ్‌లో ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ట్రావెల్ స్లాట్‌లు కేటాయిస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులు తిరిగి వచ్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇజ్రాయెల్‌లో 18వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌లో 13వందల మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ఎదురు వైమానిక దాడుల్లో గాజాలో కనీసం 19 వందల మంది మరణించారు.