GST Evasion: 2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.12 లక్షల కోట్లకు పైగా జిఎస్‌టి ఎగవేతకు పాల్పడిన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు 71 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను ఎగవేత మొత్తం మరియు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జారీ చేయబడిన షోకాజ్ నోటీసుల సంఖ్యపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
జిఎస్‌టి ఎగవేత ఎంతంటే..(GST Evasion)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (అక్టోబర్, 2023 వరకు) సెంట్రల్ జిఎస్‌టి అధికారులు గుర్తించిన మొత్తం వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి) ఎగవేత రూ1.51 లక్షల కోట్లు కాగా, 154 మందిని అరెస్టు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.18,541 కోట్ల రికవరీ జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.31 లక్షల కోట్లకు పైగా ఎగవేతలను గుర్తించామని, 190 మందిని అరెస్టు చేశామని పంకజ్ చౌదరి తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.33,226 కోట్లు రికవరీ అయ్యాయి.2021-22, 2020-21 మరియు 2019-20లో, జిఎస్‌టి ఎగవేత వరుసగా రూ.73,238 కోట్లు,రూ. 49,384 కోట్లు మరియు రూ.40,853 కోట్లు గా ఉంది. అక్టోబర్ 2023 నుండి దేశంలో ఏ ఓవర్సీస్ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు నమోదు చేసుకోలేదని చౌదరి తెలిపారు.
ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం పన్ను విధించబడుతుందని ఆగస్టులో జిఎస్‌టి కౌన్సిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు జిఎస్‌టి నోటీసులకు వ్యతిరేకంగా హైకోర్టులను ఆశ్రయించాయి. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ప్లాట్‌ఫారమ్‌లో ఆడే ఆటలు ‘స్కిల్ గేమ్‌లు’ కాబట్టి తాము 18 శాతం చొప్పున పన్నులు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నాయి.