Farooq Abdullah:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై బుధవారం లోకసభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీనిపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దులా స్పందించారు. తన తండ్రి షేక్ అబ్దుల్లా ను నెహ్రూకు జైలుకు పంపారని … అయినా తాను నెహ్రూను నిందించను అని అన్నారు. నెహ్రూ కారణంగానే ఈ రోజు కశ్మీర్ ఇండియాలో భాగమని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫారూక్ అబ్దుల్లా ఓ జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఈ పరిస్థితి కారణం నెహ్రూ అని అమిత్ షా నిందించిన విషయం తెలిసిందే.
నెహ్రూ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి..(Farooq Abdullah)
నెహ్రూ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కంకణం కట్టుకుందన్నారు ఫారూఖ్. గత 17 సంవత్సరాల నుంచి బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. ఒక వేళ నెహ్రూనే లేకుంటే ఈ రోజు కశ్మీర్ ఇండియాలో భాగమే కాదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ మీకు ఓ వాస్తవం చెప్పాలి. కశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో భాగం కాదు. పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం తాము కూడా పాకిస్తాన్‌కు వెళ్లిపోయే వారమన్నారు. దీన్ని నెహ్రూ గుర్తించి భారత్‌లో ఉండేలా కృషి చేశారన్నారు. దీన్ని వారు మరిచిపోయారన్నారు ఫరూక్.నెహ్రూ గురించి వారి మనసులో ఇంత విషం ఎందుకు ఉందో తనకు అర్ధం కావడం లేదన్నారు. నా తండ్రిని నెహ్రూ జైల్లో వేశారు. అయినా తాను నెహ్రూను నిందించను. ఎందుకంటే దేశం కోసం ఆయన ఎంతో చేశారు. దేశ ప్రజలు నెహ్రూ చేసిన సేవలను మరిచిపోరన్నారు. ఈ రోజు మనమంతా ఒక దేశంగా తలెత్తుకొని గర్వంగా నిల్చుని ఉన్నామంటే దీనికి ఆయన వేసిన పునాదులే కారణమన్నారు ఫరూక్ అబ్దుల్లా.
అమిత్ షా ప్రకటనలు ఖచ్చితమైనవి కావు. జవహర్ లాల్ నెహ్రూ ఇమేజ్‌ను చెరపలేరన్నారు. ముందు అమిత్‌షా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన వ్యక్తిగతం కావని.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నారు అబ్దుల్లా. పటేల్ కూడా కేబినెట్‌లో సభ్యుడే ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా.. మరి వీరంతా పటేల్ గురించి పల్లెత్తు మాట ఎందుకు అనరని ఆయన అమిత్ షాను, బీజేపీని నిలదీశారు.