Navneet Rana: బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం ముగిసేట్లు కనిపించడం లేదు. కాగా శనివారం నాడు నవనీత్ రాణా మరోమారు ఓవైసీని ఉద్దేశించి కొత్త వీడియోను విడుదల చేశారు. దేశంలోని ప్రతి గల్లిలో రామభక్తులు తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నవనీత్‌పై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమె తాను హైదరాబాద్‌కు వస్తానని ఓవైసీకి దమ్ముధైర్యం ఉంటే ఆపాలని సవాలు విసిరారు. ఇదిలా ఉండగా ఓవైసీ తన సోదరుడు అక్బరుద్దీన్ ఫిరంగి లాంటి వాడని తాను అతడిని కంట్రోల్ చేశానని చెప్పాడు. దీనికి నవనీత్ రాణా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫిరంగులను తమ ఇంటి ముందు అలంకరణ వస్తువుగా ఉంచుతామన్నారు రాణా.
రామభక్తులు సింహాల్లాంటి వారు ..( Navneet Rana)
రామభక్తులు, మోదీజీ సింహాల్లాంటి వారు … అలాంటి వారు దేశంలో ప్రతి వీధిలో కనిపిస్తారని ఆమె అన్నారు. తాను హైదరాబాద్ వస్తున్నాను. తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ ఆమె ఎక్స్‌లో ఓ వీడియో విడుదల చేశారు. అంతకు ముందు రాణా ఒవైసీతో పాటు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ను ఉద్దేశించి .. ఒక వేళ 15 సెకన్ల పాటు పోలీసులను తప్పిస్తే.. ఇద్దరు సోదరులు వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి పోతారో తెలుస్తుందన్నారు. అయితే అక్బరుద్దీన్ గతంలో నిజామాబాద్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ.. ఓ అరగంట పాటు పోలీసులను తప్పిస్తే.. హిందువులను పూర్తిగా అంతం చేస్తామని హెచ్చరించాడు. అప్పడు ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
అయితే నవనీత్‌రాణా చేసిన తాజా వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీలు తేలికగా తీసుకున్నారు. నవనీత్ రాణా ఇవే కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో ఒకటి.. మాధవిలత హైదరాబాద్‌ను మరో పాకిస్తాన్ కాకుండా అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఇటు కాంగ్రెస్‌కు కానీ.. ఇటు ఎంఐఎంకు కానీ ఓటు వేస్తే వారు పాకిస్తాన్‌కు ఓటు వేసినట్లేనని రాణా అన్నారు. ఇక రాణా విషయానికి వస్తే ఆమె మహారాష్ర్టలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా ఎన్నికైనారు. అయితే ఆమె చేసిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్లే అని చేసిన వ్యాఖ్యపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు కూడా నమోదయ్యింది.