Delhi: రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందన్న ఆరోపణల పై ఢిల్లీ పోలీసులు ఆమెను ప్రశ్నించేందుకు సమన్లు పంపడం ఇది రెండోసారి.
గత వారం ఈ కేసులో ప్రధాననిందితుడు చంద్రశేఖర్‌కు జాక్వెలిన్ ను పరిచయం చేసినట్లు ఆరోపించిన పింకీ ఇరానీతో పాటు ఫెర్నాండెజ్‌ను ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించడం జరిగింది. చంద్రశేఖర్ తన పుట్టినరోజున ఫెర్నాండెజ్ ఏజెంట్ ప్రశాంత్‌కు మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పాడని, అయితే అతను దానిని తీసుకోవడానికి నిరాకరించాడని విచారణలో తేలింది. అయితే, చంద్రశేఖర్ ద్విచక్ర వాహనం మరియు దాని తాళాలను ప్రశాంత్ వద్ద వదిలిపెట్టాడని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రశేఖర్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా పలువురిని మోసం చేశాడని దర్యాప్తు సంస్దలు ఆరోపించాయి. చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 17న చార్జిషీట్ దాఖలు చేసింది.