Site icon Prime9

Mizoram Rains: మిజోరంలో భారీ వర్షాలు.. కొండచరియలు పడి 10 మంది దుర్మరణం

Mizoram Rains

Mizoram Rains

Mizoram Rains:  మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిజోరాంకు యావత్‌ దేశంతో సంబంధాలు తెగిపోయాయి. రీమాల్‌ తుఫాను తర్వాత ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మిజోరాంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మంగళవారం భారీ ఎత్తున వర్షం పడ్డంతో రాళ్ల క్వారీ కూలింది పది మంది చనిపోగా.. మరికొంత మంది శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు భావిస్తున్నారు.

జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు..(Mizoram Rains)

ఇదిలా ఉండగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీయడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీ వర్షాల వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని మిజోరాం డీజీపీ అనిల్‌ శుక్లా చెప్పారు. భారీ వర్షాలకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేయాలని సూచించారు. కొండచరియలు విరగిపడ్డంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ముఖ్యమంత్రి లాల్‌దుహోమా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

రీమాల్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఆదివారం రాత్రి తీరం దాటింది. దీంతో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. రీమాల్‌ తుఫాను దెబ్బకు చెట్లు కూలాయి… విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాని ప్రభావం మిజోరాంపై కూడా కనిపించింది. ఇక వాతావరణ శాఖ వచ్చే రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ర్టాలలో కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

Exit mobile version