Mann Ki Baat: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెల నిర్వహించే రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ 100వ ఎడిసోడ్ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇందుకోసం బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది.
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు గ్లోబల్ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. మోదీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తున్నాయి. ప్రజలు ఆయన మాటలను వినాలనుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి.
కాగా ‘మన్ కీ బాత్’ సిరీస్‌లో మోదీ ప్రస్తావించిన ప్రతిభావంతులందరినీ గౌరవించడంతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు ఆయా రాష్ట్రాల్లో వారిని ఆహ్వానిస్తారన్నారు. అంతేకాకుండా అంతగా ప్రచారానికి నోచుకుని సదరు ప్రతిభావంతులందరినీ ఢిల్లీకి కూడా ఆహ్వానిస్తామని ఆ వర్గాలు తెలిపాయి. అనేక విశేషాలతో 100వ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నట్టు చెప్పారు.
మరో వైపు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని ప్రధాని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన వాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ గౌరవం అందుకున్న వారిని గౌరవించడంతో పాటు వారు స్పందనలు కూడా వినే అవకాశం ఉంది.
ఏప్రిల్ 30న 100వ ఎపిసోడ్ (Mann Ki Baat)
కాగా, ప్రధాని ‘మన్ కీ బాత్’ 100 వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఘన విజయం సాధించేలా లక్షకు పైగా బూత్‌లలో టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనప్పటికీ ఏమాత్రం గుర్తింపునకు నోచుకోని వారి సేవలను ‘మన్ కీ బాత్’ ద్వారా వెలుగులోకి తేవడం జరుగుతోంది. వీటితో పాటు వాతావరణ మార్పులు, వ్యవసాయం, కళలు, సంస్కృతి, ఆరోగ్యం లాంటి అంశాలు సందర్భానుసారంగా ఈ ప్రోగ్రాంలో చోటు చేసుకుంటున్నాయి. దేశాన్ని ఏకతాటిపైకి తేవడం, సమష్టి అభివృద్ధి సాధన లక్ష్యంగా ‘మన్ కీ బాత్’ ముందుకు సాగుతోంది.