Manish Sisodia: డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను కలిసేందుకు వారానికి ఒకసారి అనుమతించింది. అది ఈడీ, సీబీఐ అధికారులు సమక్షంలోనే మాత్రమే అని షరుతు విధించింది. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల విషయానికి వస్తే దిల్లీ హైకోర్టు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈడీ, సీబీఐ స్పందన కోరింది. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. కాగా సిసోడియా భార్య సీమా వివిధ రకాల జబ్బులతో… ఉదాహరణకు కండరాల బలహీనతతో పాటు రోగనిరోధక శక్తి క్షీణించడం, నరాల బలహీనతతో కూడా బాధపడుతున్నారు.
ఇదిలా ఉండగా గత నెల 30న ట్రయల్‌కోర్టు మనీలాండరింగ్ కేసులో సిసోడియా బెయిల్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా సిసోడియా తన పిటిషన్‌లో ట్రయల్ కోర్టు ఆర్డరుకు లోబడే తనను వారానికి ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూడ్డానికి అనుమతించాలని దిల్లీ హైకోర్టును కోరారు. కాగా సిసోడియా వినతిని కోర్టు ఈడీకి, సీబీఐకి పంపించింది. దానికి వారు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా దీనిపై దిల్లీ హైకోర్టు జస్డిస్ స్వర్ణ కాంత శర్మ ఈడీ, సీబీఐ స్పందన గురించి తెలియజేయాలని కేసును ఈ నెల 8కి వాయిదా వేశారు.
ఏడాదికిందట అరెస్ట్ ..(Manish Sisodia)
డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసింది. స్కాంలో సిసోడియా పాత్ర ఉందని రుజువు చేయడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. అటు తర్వాత దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను తిహార్‌జైలుకు పంపించింది. అటు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కింద సిసోడియాను జైలు నుంచి అరెస్టు చేసింది తమ కస్టడీలోకి తీసుకొని మళ్లీ అదే తిహార్ జైలుకు పంపించింది. ప్రస్తుతం లిక్కర్ స్కాంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే సంజయ్‌సింగ్‌కు ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 8న సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.