Manipur: మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
నదిలో కలిసే అవకాశం..(Manipur)
ఈ ప్రవాహాలు ఈ ప్రాంత జీవనరేఖ అయిన ఇంఫాల్ నదిలో కలిసే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ విపత్తును నివారించడానికి, యంత్రాలు, మానవశక్తి మరియు నైపుణ్యం పరంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) సంబంధిత శాఖలను ఆదేశించింది.ప్రభావిత వాగుల్లోని నీటి ప్రవాహాన్ని పొలాల వైపు మళ్లించేందుకు భారీ యంత్రాలను మోహరించినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇంధనం లీకేజీ ప్రమాదవశాత్తు జరిగిందా లేక వెనుక ఎవరైనా ఉన్నారా అనేది నిర్దారించవలసి ఉందని అన్నారు. మణిపూర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ (పిహెచ్‌ఇడి) మంత్రి లీషాంగ్‌థెమ్ సుసింద్రో మైతేయ్ మరియు అటవీ శాఖ మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ గత రాత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.