Manik Saha: త్రిపురలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మాణిక్ సాహా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే మార్గం సుగమం అయింది.ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది.తిప్రా మోత పార్టీ 42 స్థానాల్లో పోటీ చేసి 13 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.సీపీఎం 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది.
వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి..(Manik Saha)
2016లో బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకుడు మాణిక్ సాహా త్రిపుర ఎన్నికలకు 10 నెలల ముందు ముఖ్యమంత్రి అయ్యారు. బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో ఆయన సీఎం అయ్యారు.రాజకీయాల్లోకి రాకముందు, ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జరీ స్పెషలిస్ట్ అయిన మానిక్ సాహా హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో బోధించేవారు.త్రిపుర కొత్త ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్చి 8న జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు.
సీఎం రేసులో ప్రతిమా భౌమిక్ పేరు..
అంతకుముందు త్రిపుర సీఎంగా కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ నియమితులవుతారని ప్రచారం జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, భౌమిక్ 305,689 ఓట్ల భారీ తేడాతో అప్పటి సిట్టింగ్ ఎంపీ శంకర్ ప్రసాద్ దత్తాను ఓడించారు.రెండేళ్ల తరువాత జూలై 2021లో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర నుంచి మొట్టమొదటి కేంద్రమంత్రి ప్రతిమా బౌమిక్ కావడం విశేషం. ప్రతిమా భౌమిక్ తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.ఆమెకు ముగ్గురు తోబట్టువులు. స్వతహాగా క్రీడాకారిణి అయిన ప్రతిమా బౌమిక్ ,ఆమె బ్లాక్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో ఖో-ఖో మరియు కబడ్డీ ఆడేది. అంతేకాదు తన స్వస్థలమైన సోనామురాలోని బరనారాయణ్‌లో వ్యవసాయం చేసేది.
ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాల గురించి అడిగినప్పుడు, భౌమిక్ ఇలా అన్నారు.నేను అంకితభావంతో కూడిన పార్టీ కార్యకర్తను. పార్టీ కారణంగానే నేను మీ ముందు కూర్చున్నాను. పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల్లో పోటీ చేశాను, పార్టీయే నాకు తల్లి. కాబట్టి, ఎవరైనా ఏదైనా ఊహాగానాలు చేయకూడదు. పార్టీ ఏది చెబితే అది చేస్తాను అంటూ పేర్కొన్నారు. మరోవైపు త్రిపుర బీజేపీ చీఫ్ రాజీబ్ భట్టాచార్జీ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమై నేతను ఎన్నుకుంటుందని చెప్పారు.