Bride:పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ఆ అమ్మాయి అనుకుంది. పెళ్లి సమయం కూడా దగ్గరపడింది. కానీ అంతలోనే పెళ్లి కూతురికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కూతురు వేసుకున్న మేకప్.. ఆమెకు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. చివరకి ఆ పెళ్లిని వరుడు రద్దు చేసేవరకు వెళ్లింది. ఇంతకి ఏం జరిగిందో తెలుసా?
కొద్ది రోజుల్లో పెళ్లి.. పెళ్లవ్వగానే అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కోసం వేసుకున్న మేకప్ పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. అందంగా ఉండాలని ప్రయత్నించి చివరికి.. ఆసుపత్రిపాలైంది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో అందంగా కన్పించాలని మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లింది ఓ వధువు. బ్యూటీ పార్లర్ లో చేసిన ప్రయోగం ఒక్కసారిగా బెడిసికొట్టింది. ఉన్న ముఖం కాస్తా వికారంగా మారింది. ముఖం అందవికారంగా మారడంతో.. నాకు ఈ అమ్మాయి వద్దు అంటూ వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
హసన్ జిల్లాలోని అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వివాహ తేదీ దగ్గర పడుతుండటంతో 10 రోజుల క్రితం స్థానిక బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న ఓ మాట విని కొత్త రకమైన మేకప్ వేసుకుంది. ముఖానికి ఫౌండేషన్ రాసి ఆ తర్వాత ఆవిరి పట్టింది. ఈ ప్రయోగం కాస్తా బెడిసికొట్టంది. దీంతో ఆ అమ్మాయి ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. దీని ప్రభావంతో ముఖాకృతి కూడా పూర్తిగా మారిపోయింది. ముఖం నిండా గాయాలు కావడంతో.. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అలెర్జీ కారణంగా బాధిత యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురైందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీషియన్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మెుదట అమ్మాయి పరిస్థితి కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. అయితే వధువు ముఖ పరిస్థితి గురించి తెలుసుకున్న వరుడు తనకీ ఈ పెళ్లి వద్దంటూ రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేటి కాలంలో చాలా మంది యువతులు ప్రతి చిన్న పండగకి బ్యూటీ పార్లరను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు మరింత అందంగా ఉండాలని బ్యూటీపార్లర్లకు వెళ్తున్నారు. ఫ్యాషన్ పెరుగుతున్న కాలంలో ఇది సహజమే అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాస్మోటిక్ ఉత్పత్తులతో ప్రయోగాలు చేసే ముందు జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీ మార్గదర్శకాలకు అనుగుణంగానే వాటిని ఉపయోగించాలని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే ఇలాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.