Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్‌లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 1,00,186 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఝార్ఖండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు వరకే ఓటు వేసుందుకు అనుమతి ఇవ్వనున్నారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు బరిలో నిల్చుండగా.. ఝార్ఖండ్‌లో మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో 528 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక, ఈనెల 23న ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది.
ఓటు వేసిన ప్రముఖులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం పోలింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలోనే ప్రముఖులు ఓటు వేసేందుకు పోటెత్తారు. బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేయగా.. ముంబైలోని రాజ్ భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే నాగ్‌పూర్‌లోని ఓ పోలింగ్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముంబైలో పలు పోలింగ్ కేంద్రాల్లో బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్, యాక్టర్ రాజ్ కుమార్ రావ్, సినీ నటి గౌతమీ కపూర్, ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సీనియర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.