Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో భారీ చెట్టు కూలి ఏడుగురు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు ఆలయంలోని ఓ భారీ వేప చెట్టు కూలి పక్కనే ఉన్న షెడ్ కూలడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోగా.. 30 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.
100 ఏళ్ల నాటి వేప చెట్టు కూలి(Maharashtra)
అకోలా జిల్లాలో బాలాపూర్ తహసీల్ లోని పరాస్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్థానికంగా ఉన్న ఆలయంలో మహాభారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయితే, జిల్లాలో కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న 100 ఏళ్ల నాటి వేప చెట్టు దెబ్బతింది.
భారీ ఈదురుగాలులతో(Maharashtra)
ఆదివారం ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలో భారీగా ఈదురుగాలులు వచ్చాయి. దీంతో ప్రాంగణంలోని చెట్టు విరిగిపడి షెడ్ పై పడింది. దీంతో ఆ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలడంతో భక్తులు దాని కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుల్ డోజర్ సహాయంతో భారీ చెట్టును తొలగించారు.
ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక హాస్పటిల్ కు తరలించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని పేర్కొంది.