Land for job scam: ఉద్యోగం కోసం భూమి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు కిరణ్ దేవి మరియు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన అనేక రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.ఈ కుంభకోణంలో ఇద్దరు నేతల పాత్ర ఉన్నట్లు తేలడంతో సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఆర్జేడీ ఎమ్మెల్యే, ఎంపీ నివాసాల్లో సోదాలు..(Land for job scam)
అర్రా, పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్యే కిరణ్ దేవి నివాసంలోనూ, గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీ, రేవారీలోని రాజ్యసభ సభ్యుడు ప్రేమ్ చంద్ గుప్తా ప్రాంగణాల్లోనూ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.ఎమ్మెల్యే కిరణ్ దేవి లాలూకు సన్నిహితురాలు. మాజీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ భార్య. ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కిరణ్‌దేవికి చెందిన పలుచోట్ల సీబీఐ బృందం సోదాలు కొనసాగిస్తోంది.
ఉద్యోగం కోసం భూమి కుంభకోణం..
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ 2004-2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో సెంట్రల్ రైల్వేలో జరిగిన నియామకాలు రిక్రూట్‌మెంట్ విధానాలను ఉల్లంఘించాయని సీబీఐ ఆరోపించింది. .రిక్రూట్‌మెంట్ నియామకాలకు సంబంధించి పబ్లిక్ నోటీసు లేదా ప్రకటన లేదు, అయితే ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్ మరియు హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో పాట్నాలోని కొంతమంది నియమించబడ్డారు. ఈ నియామకంకోసం గాను లాలూ ప్రసాద్ యాదవ్ వారి వద్ద భూమలు తీసుకుని గ్రూప్ డి ఉద్యోగాల్లో నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో లాలూ కుమార్తెలు, కుమారుడు తేజస్వి యాదవ్ నివాసాల్లోనూ గతంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.