Site icon Prime9

మల్లికార్జున ఖర్గే : ప్రధాని మోదీతో కలిసి లంచ్ చేసిన మల్లికార్జున ఖర్గే

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి. ఈ నేపథ్యంలో ఖర్గే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకే చోట కూర్చుని సంతోషంగా గడిపారు. తృణ ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల విందు సందర్భంగా వీరిద్దరూ కలిసి ముచ్చటించుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ విందులో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కూడా పాల్గొన్నారు.

రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో భారత్ జోడో యాత్ర లో భాగంగా జరిగిన ర్యాలీలో మల్లికార్జున ఖర్గే నిన్న మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది., బీజేపీ కనీసం ఓ శునకాన్ని అయినా పోగొట్టుకోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ అందుకు ససేమిరా అంది.

2023ను అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఈ రోజు తృణ ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలతో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఒకే చోట కూర్చుని లంచ్ ను ఆస్వాదించారు. పరస్పరం ఛలోక్తులు విసురుకుంటూ మాట్లాడుకున్నారు.

అనంతరం మోదీ దీనిపై ట్వీట్ చేసారు. 2023ను అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నామని, ఈ నేపథ్యంలో పార్లమెంటులో రుచికరమైన విందు జరిగిందని తెలిపారు. ఈ విందులో తృణ ధాన్యాలతో తయారు చేసిన నోరూరించే ఆహార పదార్థాలను వడ్డించారని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Exit mobile version