Site icon Prime9

Amrit Pal Singh : ఎట్టకేలకు 35 రోజుల పరారీ తర్వాత పోలీసులకు లొంగిపోయిన అమృత్ పాల్ సింగ్..

khalisthani leader amrit pal singh surrender in front of punjab police station

khalisthani leader amrit pal singh surrender in front of punjab police station

Amrit Pal Singh : ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ‘వారిస్ పంజాబ్ దే’ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన అమృత్ పాల్ సింగ్ దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. కాగా  ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా జిల్లాలో పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయాడు. అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడని తెలుస్తుంది. పంజాబ్ పోలీసులు, జాతీయ నిఘా విభాగం అధికారులు సంయుక్తంగా అమృత్‌పాల్‌ను అదుపులోకి తీసుకోగా..  అస్సాంలోని దిబ్రూఘర్‌ జైలుకి తరలించినట్లు సమాచారం.

అమృత్‌పాల్ సింగ్‌ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌‌ను ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విడిపించుకోవాలన్న అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 23న యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. దీంతో యువతను రెచ్చగొట్టారంటూ అమృత్‌ పాల్‌పై కేసు నమోదైంది. దీంతో మార్చి 18 నుంచి పోలీసులు అతని కోసం గాలింపు మొదలు పెట్టారు. ఆ తర్వాత అతడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అయితే,ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన అమృత్ పాల్ సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలా జరగలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్టు మార్చిలో పోలీసులు ప్రకటించారు. అలాగే, అతడిపై లుక్ అవుట్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు.  అమృతపాల్‌పై వివిధ వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించడం వంటి అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

అంతకు ముందు అమృత్ పాల్ నేపాల్, పాకిస్థాన్, సింగపూర్ వంటి దేశాలకు అతను పారిపోవాలని ప్రయత్నించాడని తెలిసింది. అప్పటికే ప్రముఖ విమానాశ్రయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా అమృత్ పాల్ కోసం పోలీసులు నిఘా ఉంచారు. అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్ననాటి నుంచి అతని అనుచురులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేస్తూ వచ్చారు. ఇటీవల అతని ప్రధాన అనుచరులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి తోడు లండన్ కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతని భార్య కిరణ్ దీప్‌కౌర్‌ను ఈ నెల 20న శ్రీగురురామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తరువాత పంజాబ్ పోలీసులు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ధృవీకరించారు. అమృత్ పాల్‌ను మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు పోలీసులు ఓ విజ్ఞప్తి చేశారు. శాంతి, సామరస్యాలను కాపాడాలని, ఎలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

 

 

అదే విధంగా అమృతపాల్ సహాయకులలో ఎనిమిది మంది అయిన.. దల్జిత్ సింగ్ కల్సి, పాపల్‌ప్రీత్ సింగ్, కుల్వంత్ సింగ్ ధాలివాల్, వరిందర్ సింగ్ జోహల్, గుర్మీత్ సింగ్ బుక్కన్‌వాలా, హర్జిత్ సింగ్, భగవంత్ సింగ్, గురిందర్‌పాల్ సింగ్ ఔజ్లా పై జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. వీరందరినీ కూడా దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు.

 

Exit mobile version