Kerala Explosions: కేరళలోని కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన పలు పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో పలు పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐదుగురు తీవ్రంగా గాయపడగా,30మందికి స్వల్ప గాయాలయ్యాయి. కన్వెన్షన్ సెంటర్‌లో చర్చి కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.పేలుడు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కాగా, పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.పేలుళ్లలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌లను ఆదేశించారు.సెలవులో ఉన్న వైద్యులతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరూ వెంటనే తిరిగి రావాలని మంత్రి ఆదేశించారు. కలమస్సేరి మెడికల్ కాలేజ్, ఎర్నాకులం జనరల్ హాస్పిటల్ మరియు కొట్టాయం మెడికల్ కాలేజీలో అదనపు సౌకర్యాలను సిద్ధం చేయాలని కూడా సూచనలు ఇవ్వబడ్డాయి.