Site icon Prime9

Arif Mohammad Khan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు జెడ్+ సెక్యూరిటీ మంజూరు

Arif Mohammad Khan

Arif Mohammad Khan

Arif Mohammad Khan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం జెడ్+ సెక్యూరిటీ మంజూరు చేసింది.అధికార సీపీఐ(ఎం) పార్టీ విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నల్ల జెండా ప్రదర్శనపై గవర్నర్ రోడ్డు పక్కన కూర్చోని నిరసనకు దిగిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఎఫ్‌ఐఆర్ కాపీని చూపించాలని..(Arif Mohammad Khan)

రాష్ట్ర రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లాం జిల్లాలో ఆరిఫ్ ఖాన్ కాన్వాయ్‌ను శనివారం నాడు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకుని నల్లజెండాలు చేతబూని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో హై డ్రామా చోటుచేసుకుంది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్, తన కారు దిగి విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులు ఆ ప్రాంతం నుండి నిరసనకారులను తొలగించిన తరువాత, ఖాన్ ఒక దుకాణం నుండి కుర్చీ తీసుకొని ఆందోళనకారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన వద్దకు పోలీసు కమిషనర్‌ ను తీసుకురావాలని తన వ్యక్తిగత సిబ్బందిని కూడా కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని చూపించే వరకు ఖాన్ వెళ్లేందుకు నిరాకరించడంతో రెండు గంటలకు పైగా నాటకీయ సన్నివేశాలు కొనసాగాయి.చివరకు 17 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై నాన్‌ బెయిలబుల్‌ నిబంధనల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీని పోలీసులు ఆయనకు అందించారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలో అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారని ఖాన్ ఆరోపించారు. పలు క్రిమినల్ కేసులు ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆ మార్గం గుండా వెళుతుంటే నిరసనకారులను రోడ్డు పక్కన పోలీసులతో పాటు వరుసలో ఉంచడానికి అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version