Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది. కనక పురా నియోజక వర్గం నుంచి డీకే శివకుమార్ విజయం సాధించారు. ఆయన కళ్లెం వేసేందుకు బీజేపీ ఒక్కలిగ సముదాయానికి చెందిన ఆర్. అశోక్ ను బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. డీకే ధాటికి అశోక్ నిలవలేకపోయారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటక లో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని చెప్పారు.
‘కర్ణాటకలో పార్టీని గెలిపించి తీరుతానని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాట ఇచ్చాను. నేను జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నన్ను కలవడానికి వచ్చారు. ఆ విషయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’ అని డీకే ఉద్వేగానికి గురయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అభ్యర్థి ఎవరని మీడియా ప్రశ్నించారు. దీనికి ఆయన ‘కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం. అక్కడే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఈ సందర్భంగా సిద్ధరామయ్యతో సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని డీకే అన్నారు.
‘అవినీతి పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. అధికారం, డబ్బు ఉపయోగించారు. కానీ ప్రజలు మాత్రం కలిసికట్టుగా మాకే ఓటేశారు. ఇది సమష్టి విజయం’ అని మల్లికార్జున ఖర్గే సంతోషం వ్యక్తం చేశారు.
‘2018 లో బీజేపీ ఆపరేషన్ కమలంపై భారీగా ఖర్చు చేసింది. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్‌కు ఇది పెద్ద విజయం. ఇది బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. కర్ణాటకకు మోదీ 20 సార్లు వచ్చారు. ఈ తరహాలో ఏ ప్రధాని ప్రచారానికి రాలేదు. విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ కుట్ర ఫలించలేదు’ అని సిద్ధరామయ్య విమర్శించారు. అలాగే 2024లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.