Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో తొలిసారి ఓటర్లు 11 లక్షల 71 వేల 558 మంది ఉన్నారు. వీరి ఓట్లు ఇప్పుడు కీలకం కానున్నాయి. బరిలో 16 పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య నడుస్తుంది. ఈ ముక్కోణపు పోటీలో ఎవరు అధికారం దక్కించుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌దే విజయమని చెబుతున్నాయి.
అభ్యర్ధుల వివరాలు..
ఈసారి మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అలానే ఈ ఎన్నికల్లో 918 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. అదే విధంగా ఈసారి కర్ణాటక ఎన్నికల్లో చాలా మంది సంపన్న అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఇందులో అత్యంత ధనిక స్వతంత్ర అభ్యర్థి యూసుఫ్ షరీఫ్.. ఈయన ఆస్తులు దాదాపు 1,633 కోట్లుగా సమాచారం. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీకి చెందిన ఎన్ నాగరాజు (1,609 కోట్లు), కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ (1,413 కోట్లు) ఉన్నారు.
పోలింగ్ శాతం..
గత ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా ఉంది..
1999 – 67.65%
2004 – 65.17%
2008 – 64.68%
2013 – 71.45%
2018 – 72.36%
ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 20.94శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకుమించి నమోదయ్యేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.
పోలీసు బందోబస్తు (Karnataka Elections 2023)..
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నాటక వ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులను కూడా ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. ఏపీ నుంచి నుంచి 1000 మంది పోలీసులు, 1000 మంది హోంగార్డులు , తెలంగాణ నుంచి 516 మంది పోలీసులు, 684 మంది హెంగార్డులు కర్ణాటక ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ..
బెంగళూరులోని పోలింగ్ బూత్‌లో మొదటిసారిగా భారత ఎన్నికల సంఘం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఫేషియల్ రికగ్నేషన్ కోసం మొబైల్ అప్లికేషన్‌లో ఓటర్లు తమ ఎలక్టర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీని జనరేట్ చేయాలి. అలా అయిన తర్వాత ఓటర్లు యాప్ ద్వారా సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. ఓటరు పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పుడు, వెరిఫికేషన్ కోసం వారి ఫేస్‌ని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి స్కాన్ చేస్తారు. ఓటరు EPIC లోని ఫొటో, EC డేటాబేస్ లోని ఫొటోతో మ్యాచ్ అయితే.. ఓటరు ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ అందించకుండానే ఓటు వినియోగించుకోవచ్చు. ఓటింగ్‌లో ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ క్యూలను తగ్గించడం.. తక్కువ సిబ్బందిని నియమించుకోవడం లాంటి ప్రయోజనాలను అందిస్తుంది.