Karnataka Assembly Election Schedule: కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రంలో మే 10న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మే 14న వెలువడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 20. ఏప్రిల్ 21 నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 24.
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తుంది. ఓటర్ల జాబితాలో 5.21 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు, వీరిలో 5.55 లక్షల మంది దివ్యాంగులు.అసెంబ్లీ ఎన్నికల కోసం 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. 50% పోలింగ్ స్టేషన్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంది. 1320 పోలింగ్ స్టేషన్లను మహిళా అధికారులు నిర్వహిస్తారు.
ఈ సందర్బంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా మాట్లాడుతూ, కర్ణాటకలో 2018-19 నుండి 9.17 లక్షల మంది మొదటి సారి ఓటర్లు పెరిగారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లందరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయవచ్చని అన్నారు.దివ్యాంగులకు, 80ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు.మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది.
మార్చి 25న కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.ఇదే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని సిద్ధరామయ్య అన్నారు. తాను వరుణ నియోజకవర్గం కుమారుడినని, అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే కోలార్ ప్రజలు నాపై ప్రేమ చూపి అక్కడి నుంచి కూడా పోటీకి దిగాలని కోరారని, అందుకే కోలార్ నుంచి కూడా టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ని కోరినట్లు ఆయన తెలిపారు.అంతకుముందు మార్చి 20న, మార్చి 20న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని పార్టీ ప్రకటించింది.