Actor Darshan Manager Suicide: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మేనేజర్ శ్రీధర్ బెంగుళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీధర్ మృతదేహంతో పాటు సూసైడ్ నోటు, వీడియో మెసేజును పోలీసులు గుర్తించారు. తన చావుకు తానే కారణమని దర్యాప్తులో తన కుటుంబాన్ని చేర్చవద్దని లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో ఛాలెంజింగ్ స్టార్ అని తరచుగా పిలవబడే దర్శన్ తూగుదీప ఇటీవలే రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయ్యాడు. దర్శన్ ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకా స్వామి కించపరిచే సందేశాలు పంపారనే ఆరోపణల చుట్టూ ఈ కేసు నడుస్తోంది. రేణుకా స్వామిని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసేందుకు దర్శన్ తన మద్దతుదారులతో ప్రణాళిక రూపొందించానే ఆరోపణలపై అరెస్టు చేసారు. ఈ కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర సహా 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
రేణుకాస్వామి హత్య జరిగినరోజు దర్శన్ బెంగళూరులోని ఒక పబ్‌లో పార్టీ చేస్తున్నాడని తెలుస్తోంది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, అతని మరణానికి ముందు చిత్రహింసలకు గురిచేశారన్న షెడ్ వద్దకు ఈ పార్టీ తరువాత వెళ్లినట్లు సమాచారం. హత్యకేసులో నిందితుల్లో ఒకరయిన దర్శన్ స్నేహితుడు వినయ్ ఈ పబ్ కు యజమాని అని తెలిసింది. పోలీసులు ఈ పబ్ లో విచారణ చేయడానికి సిద్దమయ్యారు. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి మరో కన్నడ నటుడు చిక్కన్నను కూడా బెంగళూరు పోలీసులు విచారణకు పిలిచారు.