Kamal Haasan: నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28 ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిహ్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే 19 రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. రాజ్యాంగాధినేతగా మాత్రమే కాకుండా పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి అంతర్భాగంగా ఉండటంతో ఆమెతోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.
మరో సారి ఆలోచించాలి(Kamal Haasan)
కాగా, విపక్షాలు పార్లమెంట్ భవన ప్రారంబోత్సవాన్ని బాయ్ కాట్ చేయడంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. దేశ ఐక్యత కోసం ఒక్కరోజు విభేదాలన్నీ పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బహిష్కరణ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు మరో సారి ఆలోచించాలని కోరారు. అదేవిధంగా, ప్రారంభోత్సవానికి దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది మర్మును ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటని ప్రధాని మోదీని సైతం కమల్ ప్రశ్నించారు.
విభేదాలను పక్కనపెట్టి (Kamal Haasan)
పార్లమెంట్ నూతన భవనం అనేది దేశ ఐక్యతకు సంబంధించిన కార్యక్రమం అని కమల్ అన్నారు. కొత్త ఇంటి గృహప్రవేశం జరుగుతున్నపుడు కుటుంబ సభ్యులంతా హాజరు కావాల్సిన అవసరం ఉందన్నారు. విభేదాలు ఏవైనా ఉంటే పబ్లిక్ ఫోరంలో గానీ, ఉభయ సభల్లో గానీ లేవనెత్తాలని సూచించారు. దేశంతో పాటు ప్రపంచ మొత్తం ఆసక్తిగా తిలకిస్తున్న ఈ వేడుక కోసం రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టాలని కమల్ సూచించారు.
రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు
అదే విధంగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చారిత్రకఘట్టంగా కమల్ అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి అభినందనలు తెలియ జేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి ఉందని.. అయితే జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభోత్సవ పండగలో భాగస్వామ్యం అవుతున్నట్టు పేర్కొన్నారు. పార్లమెంట్ పాస్ చేసే బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలు అవుతాయని, పార్లమెంట్ ఉభయ సభలను సమావేశ పరచడం, నిరవధికంగా వాయిదా వేయడం లాంటి అధికారాలన్నీ రాష్ట్రపతి వద్దే ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రధాని మోదీని కమల్ హాసన్ కోరారు.