Marriages In Bihar: ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు. వివాహాది శుభకార్యాలలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహంతో తుపాకులను ఉపయోగించి కాల్పులకు దిగడంతో పోలీసులు ఈ నిబంధనలను రూపొందించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, కళ్యాణమండపాలు, ఫంక్షన్ హాళ్లు, మరియు ధర్మశాలల యజమానులు సీసీటీవీ కెమెరాలతో సహా భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించాలి.తమ ఇంటి వద్ద వివాహాలు నిర్వహించుకునే వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తమ వద్ద ఉన్న లైసెన్స్ ఆయుధాల జాబితాను అందించాలని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతిథుల జాబితాను అందించాలి.పెళ్లి వేడుకలు, బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ యానివర్సరీ పార్టీలు మొదలైనప్పుడు ఉత్సాహంగా ఉన్నవారు గాలిలోకి కాల్పులు జరపడం గమనించాము.అనవసరంగా కాల్పులు జరపడం చట్టరీత్యా నేరమని, నేరస్తులపై చర్యలు, జైలు శిక్షలు తప్పవని సంజయ్ సింగ్ తెలిపారు.
మేము 2022లో 99 సెలబ్రేటరీ ఫైరింగ్ కేసులు నమోదు చేసాము. ఇందులో 8 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. మేము 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము 8 ఆయుధాల లైసెన్స్‌లను కూడా రద్దు చేసాము. 2023లో మే 31 వరకు ఇటువంటి కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి 72 మందిని అరెస్టు చేసి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సింగ్ తెలిపారు.