Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు బహుళ-అంతస్తుల భవనాలు కూలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. బాధితులను రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.
మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈరోజు నుండి వచ్చే రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
కులు నుండి కలవరపరిచే విజువల్స్ వెలువడుతున్నాయి. వినాశకరమైన కొండచరియల మధ్య ఒక భారీ వాణిజ్య భవనం కూలిపోతున్నట్లు కనపించింది. పాలనాయంత్రాంగం ప్రమాదాన్ని గుర్తించి, రెండు రోజుల ముందే భవనాన్ని విజయవంతంగా ఖాళీ చేయించడం గమనార్హం అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు గతంలో ట్విట్టర్‌గా పిలిచే ఎక్స్‌లో రాశారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ముందుజాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగిపడకముందే తరలింపు కార్యక్రమం చేపట్టామని హిమాచల్ ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి సంజయ్ కుందు తెలిపారు.రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కులు-మండి హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మొత్తం 709 రోడ్లు మూసివేయబడ్డాయి.
ఎనిమిదివేల కోట్ల నష్టం..(Himachal Pradesh)
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 24 నుండి రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చినప్పటి నుండి కొనసాగుతున్న వర్షాల వినాశనం నుండి ప్రజా మౌలిక సదుపాయాలకు జరిగిన మొత్తం నష్టం రూ.8,014.61 కోట్లుగా అంచనా వేసింది.రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల కారణంగా 2,022 ఇళ్లు పూర్తిగా, 9,615 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 113 కొండచరియలు విరిగిపడడం వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.వర్షం కారణంగా 224 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 117 మంది వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో మరణించారని ప్రభుత్వ బులెటిన్‌లో పేర్కొంది.