Hemant Soren: జార్ఖండ్ పీఠంపై హేమంత్.. రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు

Hemant Soren to take oath as Jharkhand Chief Minister: జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

హేమంత్ ఒక్కడే ప్రమాణం
గురువారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జేఎంఎం- కాంగ్రెస్ కూటమి భాగస్వాముల మధ్య కేబినెట్ ఏర్పాటు విషయంలో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రాకపోవటంతో ఎవరూ మంత్రులుగా ప్రమాణం చేయలేదు.

హాజరైన ప్రముఖులు..
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో బాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎంకేజ్రీవాల్ దంపతులు, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అదే మన బలం
ప్రమాణ స్వీకారోత్సవానికి కాస్త ముందుగా ఆయన జార్ఖండ్ ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలను ఎవరూ విడగొట్టలేరని అందులో వ్యాఖ్యానించారు. ‘ఐకమత్యమే మన ఆయుధం. అందులో ఏ సందేహం లేదు. మనల్ని ఎవరూ విభజించలేరు. తప్పుదోవ పట్టించలేరు. మన గొంతు నొక్కాలని కొందరు చేసిన ప్రయత్నాలను మనం రెట్టింపు బలంతో తిప్పికొట్టాం. మనమంతా జార్ఖండ్‌ బిడ్డలం. ఎవరికీ తలవంచం’ అని హేమంత్‌ అందులో పేర్కొన్నారు.

అవరోధాలను అధిగమించి..
గురువారం నాల్గవసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 49 ఏళ్ల హేమంత్.. రాజ్యసభ ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2010 – 2013 మధ్యకాలంలో బీజేపీ-జేఎంఎం కూటమి ప్రభుత్వంలో అర్జున్ ముండా సీఎంగా ఉండగా, హేమంత్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్, ఆర్జేడీ పొత్తుతో తొలిసారి సీఎం అయ్యారు. కానీ, 2014 ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలవటంతో ఐదేళ్ల పాటు విపక్ష నేతగా కొనసాగి, 2019 ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి గెలుపుతో రెండోసారి సీఎం అయ్యారు. కాగా, 2024లో భూ కుంభకోణం కేసులో జరిగిన మనీ లాండరింగ్ ఆధారంగా ఈడీ ఆయనను అరెస్టు చేయటంతో చంపై సోరెన్‌ను సీఎంగా కూర్చోబెట్టారు. దాదాపు 6 నెలల తర్వాత.. బెయిల్‌పై జైలు నుంచి వచ్చిన హేమంత్ మూడవసారి సీఎం కుర్చీని దక్కించుకోగా, తాజా ఎన్నికల్లో మరోసారి గెలిచి నాల్గవసారి ముఖ్యమంత్రి కాగలిగారు.