Gujarat Earthquake: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. భూకంపం అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం సిరియా, టర్కీ ల్లో పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది. ఎటు చూసినా శిథిలాల గుట్టలు, శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. రోజుకు రోజుకూ మృతుల సంఖ్యల పెరుగుతూనే ఉంది. ఈ ఘోర విపత్తు లో రెండు దేశాల్లో దాదాపు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో వైపు భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 గా భూకంప తీవ్రత నమోదు అయింది. శుక్రవారం అర్థరాత్రి తర్వాత సూరత్ జిల్లాలో ప్రకంపనలు వచ్చాయని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సూరత్ లోని పశ్చిమ నైరుతి తీరాన 27 కిలో మీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 5.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు.
గత అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. కాగా, గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో 2001లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 13,800 మంది మరణించగా, 1.67 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. భారత్ లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో ఇది రెండోది.
భారత్ రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ హెచ్చరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలు పై 7.5 తీవ్రతతో భూప్రకంపనలు వస్తాయని ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో హిమాలయాలు, గుజరాత్ లోని కచ్ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ తెలిపారు. ఇవి అత్యంత హై డ్యామేజ్ రిస్క్ జోన్ లో ఉన్నాయన్నారు. హిమాలయాలలోని కుమావోన్ హిమాచల్ ప్రాంతంలో 2004 లో రిక్టర్ స్కేల్ పై 7.5 నుంచి 8.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు గుర్తుచేశారు.
దేశంలో భూకంపాలు సంభవిస్తాయని పలు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1819, 1845, 1847,1848, 1864, 1903, 1938, 1956, 2001లో అతిపెద్ద భూకంపాలు సంభవించాయి. 2001లో వచ్చిన కచ్ భూకంపం గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అతిపెద్దది.