Oommen Chandy: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ ఇకలేరు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. గత ఏడాది అక్టోబరులో ఒమెన్ చాందీ బెర్లిన్ ఛారిటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్థుతం అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఒమెన్ చాందీ కుమారుడు ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ఒమెన్ చాందీ మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ సంతాపం తెలిపారు.
ఒమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచి అంచలంచెలుగా పార్టీలో కీలక పదవులను చేపట్టారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం ఆయన సాధించారు. ప్రజల మధ్యే ఉంటే వారి యోగ క్షేమాలు చూడడమే తన విజయ రహస్యమని చాందీ ఎంతో వినయంగా చెప్పేవారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు చాందీ. 2020 సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఆయన ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నప్పటికీ ఎన్నడూ పార్టీ మారలేదు. ఇకపోతే రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ ఆయన ప్రజలు తన సేవలందించారు.