Tamilnadu Accident :తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్‌లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది. అయితే యార్కడ్‌కు వచ్చే సరికి బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
20 మందికి గాయాలు..(Tamilnadu Accident)
కాగా బస్సు 13వ హెయిర్‌ఫిన్ బెండ్ వద్దకు వచ్చే సరికి డ్రైవర్‌కు బస్సు కంట్రోల్ తప్పింది. నేరుగా బస్సు గోడకు గుద్దుకొని లోయలో పడింది. అయితే బస్సు నేరుగా 13వ హెయిర్‌పిన్ బెండ్ నుంచి 11వ హెయిర్‌పిన్ బెండ్ వద్దకు దొర్లకుంటూపోయి పడిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బస్సు ప్రమాదంలో గాయపడిన 20 మంది ప్రయాణికులను యార్కడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.