West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లోని దత్తపుకూర్‌లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఆరుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్శిటీకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
అక్రమంగా నిల్వచేయడం వల్ల..(West Bengal)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు పనిచేస్తున్నారు. భవనం పైకప్పు పూర్తిగా ఎగిరిపోగా, కాలిపోయిన, ఛిద్రమైన మృతదేహాలు నేలపై చెల్లాచెదురుగా కనిపించాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రాంతమంతా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పేలుడుకు గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది, అయితే అక్రమంగా బాణాసంచా నిల్వ చేయడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.