Mallikarjun kharge: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఖర్గే ఎన్నికల కమిషన్‌ను కోరారు. కేంద్రంలో ఎస్‌పీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్‌డోజర్‌తో కూల్చివేస్తారని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు ఖర్గే. వెంటనే ప్రధానిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మహారాష్ర్టంలో చట్టవ్యతిరకంగా ఏర్పడిన మహాయుతి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బుల్‌డోజర్‌ను ఉపయోగించలేదన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే.
ముంబైలో శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మీడియా సమావేశంలో శరద్‌పవార్‌తోపాటు ఉద్దవ్ థాకరే కూడా పాల్గొన్నారు. కాగా మహారాష్ర్టంలో ఇండియా కూటమి 48 సీట్లకు గాను 46 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం తాముచెప్పడం లేదు. ప్రజలే చెబుతున్నారన్నారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామన్నారు ఖర్గే. అసలైన శివసేన గుర్తు బీజేపీ లాక్కొని ఏక్‌నాథ్ షిండేకు ఇచ్చిందన్నారు.
ప్రధానమంత్రి దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఐదు కిలోల రేషన్ ఇస్తామని గొప్పగా చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పది కిలోలకు పెంచుతామన్నారు ఖర్గే. దేశరాజధానిలో ఆప్ తో జట్టు కట్టినకాంగ్రెస్ పంజాబ్ విషయానికి వస్తే ఒంటరి పోరుకు దిగుతోంది. ఢిల్లీ లోకసభ విషయానికి వస్తే మూడు సీట్లలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంది. చండీఘడ్‌లో కూడా పొత్తు పెట్టుకున్నాం. అలాగే గుజరాత్ హర్యానాలో కూడా కలిసే పోటీ చేస్తున్నామన్నారు. అయితే పంజాబ్‌లో మాత్రం ఒకరితో ఒకరు పోటీపడుతున్నామన్నారు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారన్నారు ఖర్గే. ప్రస్తుతం తమ ముందు ఉన్న ఎజెండా మాత్రం బీజేపీని ఓడించడమే అని ఖర్గే వివరించారు.
ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోకసభ స్థానాలు ఉండే రాష్ర్టం మహారాష్ర్ట .. ఇక్కడ మొత్తం 48 లోకసభ స్థానాలున్నాయి. ఐదవ విడత పోలింగ్ ఈ నెల 20న జరుగనుంది కాగా లోకసభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ జూన్ 1 వరకు కొనసాగుతోంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.