Site icon Prime9

DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు ఆఫర్లను తిరస్కరించిన డీకే శివకుమార్.. అవి ఏమిటో తెలుసా?

DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇద్దరూ ఎడతెగని భేటీలతో ఉత్కంఠను మరింత పెంచుతుండటం గమనార్హం. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయించిందని.. గురువారం సాయంత్రం కంఠీరవ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇంకా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పడంతో ఇంకా ఏం తేలలేదని స్పష్టమైంది.

రెండు ఆఫర్లను తిరస్కరించిన శివకుమార్ ..(DK Shivakumar)

రాహుల్ గాంధీ తదితరులు శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి, అతనికి నచ్చిన ఆరు మంత్రిత్వ శాఖలను తీసుకునే అవకాశాన్ని ముందుకు పెట్టినట్లు తెలిసింది. ఇది కాకపోతే మొదటి రెండు సంవత్సరాలు సిద్దరామయ్య సీఎంగా ఉంటారని, తరువాత మూడు సంవత్సరాలు శివకుమార్ ఉంటారని చెప్పారు. అయితే ఈ రెండు ఆఫర్లను శివకుమార్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

నాకు ఇవ్వకపోతే ఖర్గే సీఎం అవ్వాలి..

డీకే శివకుమార్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి చర్చించారు. ఈ భేటీ దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగింది. అంతకు మునుపు రాహుల్ గాంధీతో కూడా చర్చించిన డీకే అధిష్టానం ముందు అనూహ్య ప్రతిపాదన తీసుకొచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోతే మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని రాహుల్ గాంధీ ముందు డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా అంగీకరించనని డీకే శివకుమార్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తనకు సీఎం పదవి ఇవ్వని పక్షంలో మల్లికార్జున ఖర్గేకు అవకాశం ఇవ్వాలే కానీ సిద్ధరామయ్యను సీఎంను చేస్తే మాత్రం సహించేది లేదని డీకే పరోక్షంగా రాహుల్‌కు ఈ ప్రతిపాదనతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న ఈ పోరులో డీకే శివకుమార్ మాత్రం దిల్లీలో వేగంగా పావులు కదుపుతున్నారు.

కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ తన మద్దతుదారులతో కలిసి ఢిల్లీలోని తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ నివాసంలో సమావేశం నిర్వహించారు. తదుపరి కర్తవ్యం ఏమిటి? ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై డీకే తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో చర్చించడం గమనార్హం. డీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో మగడి బాలకృష్ణ, బేలూరు గోపాలకృష్ణ, కునిగల్ రంగనాథ్, ఇక్బాల్ హుస్సేన్.. ఎమ్మెల్యేలు శ్రీనివాస్, వీరేంద్ర పప్పి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version