Vivek Agnihotri: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెకు లీగల్ నోటీసు పంపినట్లు బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ తన ఇటీవలి ప్రకటనలలో, ది కాశ్మీర్ ఫైల్స్ మరియు ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ వంటి సినిమాలు సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీయబడ్డాయని ఆరోపించారు.
కోల్‌కతాలోని రాష్ట్ర సెక్రటేరియట్‌లో విలేకరుల సమావేశంలో మమతాబబెనర్జీ ఇలా అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ అంటే ఏమిటి? ఇది ఒక వర్గాన్ని కించపరచడమే. ‘ది కేరళ స్టోరీ’ ఏంటి?… ఇది వక్రీకరించిన కథ. బీజేపీ కేరళ స్టోరీని వక్రీకరించిన కథనాన్ని చూపుతోంది. కొన్ని రోజుల క్రితం, బీజేపీ నిధులు సమకూర్చిన కొంతమంది తారలు బెంగాల్‌కు వచ్చారు. కొన్ని వక్రీకరించిన మరియు కల్పిత కథతో, వారు బెంగాల్ ఫైల్స్ ను సిద్ధం చేస్తున్నారు.
కాశ్మీర్ ఫైల్స్ 2022లో విడుదలైంది. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 90వ దశకంలో కాశ్మీరీ పండిట్ల వలసల కథను చెప్పింది. మరోవైపు కేరళ స్టోరీ ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. ఐసిస్ సంస్ద కేరళ కు చెందిన పలువురు యువతులను ఇస్లాం మతంలోకి మార్చి వారిని తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడం ఇతివృత్తంగా దీన్ని నిర్మించారు.