Sucharita Mohanty:ఒడిషాలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పూరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. తన వద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేశానని ఇక ఖర్చు పెట్టడానికి ఏమీ లేదని సుచరిత వాపోతున్నారు. అయితే ఆమె ఆరోపణలను ఏఐసీసీ ఒడిషా ఇన్‌చార్జి అజయ్‌కుమార్ ఖండించారు.
అభ్యర్థులను మార్చాలని ..(Sucharita Mohanty)
పూరితో పాటు మరి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి తాము విన్నించామని ఆయన చెబుతున్నారు. కాగా సుచరిత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్‌కు పంపిన ఈ మెయిల్‌లో ప్రచారానికి పార్టీ ఫండింగ్ ఇవ్వడం లేదని.. డబ్బు లేకుండా ప్రచారం చేయలేనని, తాను సాధారణ ఉద్యోగిని.. జర్నలిస్టునని పదేళ్ల క్రితం రాజకీయాల్లో చేరానని తన వద్ద ఉన్న డబ్బు ప్రచారానికి ఖర్చు చేశానని ప్రస్తుతం తన చేతిలో చిల్లిగవ్వలేదన్నారు లేఖలో వివరించారు. తన బదులు వేరే అభ్యర్థిని చూసుకోవాలని హైకమాండ్‌ను కోరారు పూరి అభ్యర్థి సుచరిత.అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ అంశం హైకమాండ్ చర్చిస్తోందన్నారు. కాగా పూరిలో నామినేషన్ ఫైలింగ్‌కు చివరి తేదీ మే 6న కాగా.. పోలింగ్ మాత్రం ఆరవ విడత మే 25న జరుగనుంది. ఇదిలా ఉండగా ఓడిషా కాంగ్రెస్ నాయకుడు అజయ్ కుమార్ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవన్నారు. అబ్యర్థులకు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 2 న పూరితో పాటు మరి కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి లేఖ రాశామని, కొత్త జాబితా ఈ రోజు లేదా రేపు రావచ్చునని అన్నారు. ఈ విషయం ఆమెకు తెలుసు. అందుకే ఆమె టిక్కెట్ తిరిగి ఇచ్చేసి .. ఈ విషయాన్ని బహిరంగంగా వైరల్ చేస్తున్నారని సుచరితపై మండిపడుతున్నారు కుమార్.
బీజేపీ నిధులకొరత సృష్టించింది..
బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు నిధులు కొరత సృష్టించిందని మొహంతి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. పూరి పార్లమెంట్ నియోజకవర్గంలో జీరో ఫండింగ్‌తో ప్రచారం చేపట్టామన్నారు. ప్రస్తుతం ఇరు పార్టీలు బీజేపీ.. బీజేడీలు డబ్బు సంచులతో రంగంలోకి దిగాయని సుచరిత ఏప్రిల్ 29న ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక పూరి పార్లమెంటు నియోజకవర్గంలో హై ప్రొపైల్ యుద్ధం జరుగుతోంది. బీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, బీజేడీ నుంచి ముంబై పోలీసు కమిషనర్ అరుప్ పట్నాయక్ బరిలో నిలిచారు. 2019లో కాంగ్రెస్ పార్టీ కేవలం3.94 శాతం ఓటు షేరు సాధించింది. 2014లో సుచరిత మొహంతి పోటీ చేసి 18.5 శాతం ఓట్లు దక్కించున్నారు. రెండవ స్థానంలో నిలిచారు. నిధుల కొరత ఎదుర్కొవడంతో ఆమె ప్రజల నుంచి డొనేషన్లను స్వీకరించడం మొదలుపెట్టారు. ఇక సుచరితా మొహంతి విషయానికి వస్తే ఆమె ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు , కాంగ్రెస్ నాయకుడు బ్రాజా మొహన్ మొహంతి కుమార్తె. తన గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, నిధుల కొరతే తనను వేధిస్తోందన్నారు పూరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి.