Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసి నగర వాసులు వేసవి ఎండల నుంచి కాస్తా ఉపశమనం కలిగించింది. అయినా నగరంలో మాత్రం నీటి కొరత ప్రజలను వేధిస్తోంది. గురువారం ఉదయం సంజయ్ క్యాంప్ ఏరియా కు చెందిన ప్రజలు రోజువారి ఇంటి అవసరాల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూడ్డం కనిపించింది. కేవలం ఒక్క సంజయ్ క్యాంప్ ఏరియాకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. యావత్ నగరం ప్రస్తుతం మంచినీటి కొరతతో సతమతమవుతోంది. ప్రజలు నీటి అవసరాలకు ప్లాస్టిక్ కంటైనర్లలో నీటిని పట్టుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు ఢిల్లీలో నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నీరు లేక ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు ఇతర అసవరాలకు నీరు లేకుండా పోతోందని వాపోతున్నారు.
ఉదయం 6 గంటలకే క్యూలో..(Delhi Water Crisis)
నగరంలో ఎక్కడా నీరు లేదు. నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నీటి ట్యాంకర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఉదయం 6 గంటలకు నీటి కోసం క్యూలో నిలబడుతున్నాం. ఇక ట్యాంకర్ వచ్చేది మాత్రం ఉదయం 7 లేదా 8 లేదా 8.30 గంటలకు వస్తుంది. కొన్నిసార్లు అసలు ట్యాంకర్లే రావు. ఒక్కోసారి ఒక్క ట్యాంకరే వస్తుందని ఢిల్లీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇక వచ్చే ట్యాంకర్లు కూడా రోజు విడిచి రోజు వస్తుంది. ఆ ట్యాంకర్ నీరు దుర్గంధం వెదజల్లుతుంది. తాగడానికి లేదా బట్టలు ఉతుక్కోవడానికి ఆ నీరు పనికిరాదు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీనితో బోర్ నీటి కోసం ఎదురుచూడాల్సిందే.
ఇక నీటి కొరత ఒక వైపు అయితే.. రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. గత నెల 31న ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీకి విడుదల చేసే నీటిని హర్యానా ప్రభుత్వం విడుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా ఆప్ ప్రభుత్వం వాదనను హర్యా నా ప్రభుత్వం తోసి పుచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం అడిగినదాని కంటే ఎక్కువ నీరు అందిస్తున్నామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైనీ ఆప్ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే 137 క్యూసెక్కుల నీటిని శుక్రవారం లోగా విడుదల చేయాలని ఆదేశించింది.