Delhi-Mumbai Expressway: దేశంలో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. దేశానికే తలమానికంగా ఈ రహదారిని కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి మోదీ ప్రారంభించారు. కానీ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిర్మాణ పనులు కొనసాగుతున్నందు వల్ల.. ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 246 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ప్రారంభానికి నోచుకుంది. ప్రస్తుతం దీనిని మెుదటి దశగా చెబుతున్నారు.
దేశంలోనే అతిపెద్ద రహదారిగా గుర్తింపు..(Delhi-Mumbai Expressway)
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఈ రహదారిని నిర్మించింది. 1,386 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ముంబై.. ఢిల్లీని కలుపుతుంది. ఈ రహదారి పూర్తైతే.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింత తగ్గనుంది. 180 కిలోమీటర్ల దూరం తగ్గడంతో.. 24 గంటలు ఉన్న ప్రయాణం 12 గంటలకు తగ్గిపోనుంది. తొలిదశలో నిర్మించిన రహదారిని మోదీ నేడు ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ రహదారిని ప్రారంభించినట్లు విమర్శలు వస్తున్నాయి.
తగ్గనున్న దూరం.. ప్రయాణం మరింత సులభం..
తొలిదశలో భాగంగా.. సోహ్నా-దౌసా మధ్య ఈ రహదారిని నిర్మించారు. ఈ రహదారి వల్ల.. కేవలం రెండు గంటల్లోనే దిల్లీ నుంచి జైపుర్‌కు చేరుకోవచ్చు. ఈ 8 లేన్ల సోహ్నా – దౌసా రహదారిని రూ.10,400 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ప్రపంచంలోనే రికార్డుస్థాయి వేగంతో ఈ నిర్మాణం పూర్తవుతుంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్రం శంకుస్థాపన చేసింది. దిల్లీతోపాటు అయిదు రాష్ట్రాలను కలుపుతూ ఈ రహదారి నిర్మితమవుతుంది. ఇందులో రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ల దాటుతూ రహదారి వెళుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల గుండా ఈ రహదారి వెళుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం.. 15వేల హెక్టార్ల భూమిని సేకరించింది. 2023 చివరి నాటికి.. రహదారి పూర్తిగా అందుబాటులోకి రానుంది.
రహదారి ప్రత్యేకతలివే..
ముంబయి-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేకు 2019 మార్చి 9న కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం రహదారి నిర్మాణానికి కేంద్రం రూ. లక్ష కోట్లను కేటాయిస్తోంది. దీని నిర్మాణం కోసం 80 లక్షల టన్నుల సిమెంట్, 12 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. 8 లేన్లుగా నిర్మితం అవుతున్న ఈ రహదారిలో ఒక లైన్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే. ఫుడ్ స్టోర్లు, హోటళ్లు వంటివి రహదారిపై ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లు, హెలిప్యాడ్లు, మొత్తం 94 రకాల సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. రోడ్ వెంబడి 20 లక్షల మొక్కలను నాటుతున్నారు. మధ్యలో వచ్చే అభయారణ్యాల్లో జంతువులకు ఇబ్బంది కలుగకుండా.. భూగర్భం నుంచి రోడ్డు నిర్మించారు.