Delhi Liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి కోర్టు అనుమతి కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను అంగీకరించింది స్పెషల్ కోర్టు. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టు..(Delhi Liquor scam case:)
వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారంటూ శరత్ చంద్రారెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసింది.శరత్ చంద్రారెడ్డిని డిసెంబర్ 2022లో మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. రెడ్డి హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కంపెనీకి అధిపతి మరియు మద్యం వ్యాపారంలో ఉన్నారు.శరత్ చంద్రా రెడ్డి పలువురు వ్యాపార యజమానులు మరియు రాజకీయ నాయకులతో చురుకుగా ప్లాన్ చేసి కుట్ర పన్నాడని మరియు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, 2021-22లో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించాడని ఈడీ ఆరోపించింది. అతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ యొక్క లక్ష్యాలకు విరుద్ధంగా భారీ మార్కెట్ వాటాను నియంత్రించే వ్యక్తులకు నాయకత్వం వహించాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి ఉన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్‌గా మారారు. తాజాగా శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతాయనే ఉత్కంఠ నెలకొంది. ఆప్ నేతలతో పాటు, ఎమ్మెల్సీ కవితకు మరింతగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.